PoliticsTelangana
Trending

బండి సంజయ్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు

తెలంగాణలో ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినారు.

బండి సంజయ్ చేసే పాదయాత్ర పావలాకు కూడా పనికిరాని యాత్ర అని కాలె యాదయ్య పేర్కొన్నారు. ప్రజలు రాకపోవడంతో బస్సుల్లో తీసుకొచ్చి మరీ పాదయాత్ర సాగిస్తున్నారని ఆరోపించినారు. బీజేపీ చెబుతున్నట్టుగా సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని, సీఎం కేసీఆర్ ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు సమకూర్చుతున్నారని తెలిపినారు. కేసీఆర్ వంటి నేత తెలంగాణలో మరొకరు లేరని, మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ దే అధికారం అని కాలె యాదయ్య ధీమా వ్యక్తం చేసినారు.

కనీసం హైదరాబాద్ చరిత్ర ఏంటో కూడా తెలియని బండి సంజయ్ పేర్లు మార్చుతా అంటూ మాట్లాడుతున్నారని ప్రకాశ్ గౌడ్ మండిపడినారు. అసలు, బీజేపీ ప్రజలకు ఏంచేసిందో, రాష్ట్రానికి కేంద్రం ఏం ఇచ్చిందో చెప్పాలని నిలదీసినారు.

ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి స్పందిస్తూ, బండి సంజయ్ చేపడుతున్నది పాదయాత్ర కాదని, బీజేపీ కార్యకర్తల ఊరేగింపు యాత్ర మాత్రమేనని ఎద్దేవా చేసినారు. పాదయాత్రలో బీజేపీ కార్యకర్తల హడావుడి తప్ప, ప్రజలు కన్నెత్తి చూడడంలేదని తెలిపినారు. ప్రజలతో చర్చించేందుకు సమస్యలు లేకనే బండి సంజయ్ మతపరమైన అంశాలు తెరపైకి తెస్తున్నారని మహేందర్ రెడ్డి ఆరోపించినారు. కేసీఆర్ పాలనలో అన్ని మతాల ప్రజలు కలిసిమెలసి ఉన్నారని, ఇది జీర్ణించుకోలేక బండి సంజయ్ మత విద్వేషాలు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button